Sunday 26 June 2011

వెన్నెలతీరం!


తీరం! మనిషి మనసులోని రస స్పందనలన్నీ ఈ ఒక్క తీరంలో అనుభవానికోస్తాయని అనిపిస్తుంది... ప్రవాహాల పరుగులో కాళ్ళు పెట్టి ఆలోచనల సాగరంలో మునిగిపోయినప్పుడు. ఆస్వాదించాలేగాని అనుక్షణం పిల్ల తిమ్మెరలు మనల్ని ప్రేమతో స్పృసిస్తూనే వుంటాయి. ఎన్ని ఆటుపోట్లకు తట్టుకుని కొట్టుకొచ్చాయోగాని మునివేళ్ళతో యేరుతున్న గులకరాళ్ళు మన గుప్పెట్లో ఆనందంగా  వొదిగిపోయినపుడు వాటి విలువ బంగారు నాణాలకు  కూడా వుండదు.ఎవరు నేర్పిన స్వరాలోగాని అలలు నిరంతరాయంగా కొత్త సవ్వడుల సంగీతాన్ని చెవుల ముంగిట్లో వినిపిస్తూనే వున్నాయి. నీటిపాయలపై కిరణాల తళుకులాట.నాటు పడవలపై జాలర్ల బతుకుబాట. కన్నులు పట్టనంత..., మనసు చెప్పలేనంత.., సువిశాల నీటికన్యల సౌందర్యవనం. ఆ వర్ణనలకు అక్షరాలు, పదాలు, వాక్యాలు, పేరాలు, పుస్తకాలు.. ఎక్కడ సరిపోతాయి.... హృదయంలో బందించి జ్ఞాపకాల దొంతరలలో భద్రపరచుకోవడం తప్ప. ఎప్పుడైనా ఆ జ్ఞాపకాల రాజమహాల్ కిటికీ తెరిచి చూస్తే ఆ దృశ్యం ఎంత హాయిగా వుంటుంది.. పున్నమి చంద్రుని కిరణాలను పసుపులా పులుముకున్న 'వెన్నెలతీరం' లా!

ఇంతటి సౌందర్య సంతకం ఎప్పుడైనా ఆగ్రహిస్తే ఎలా వుంటుంది..? ఆగ్రహంతో జలఖడ్గం విదిలిస్తే ఏమవుతుంది..?
అప్పుడప్పుడు అలాంటివి కూడా ఉండాలేమో.. లేదంటే మనిషికి అడ్డుకట్ట వుండదేమో.. ఆటలాడాలని పెట్టిన కాళ్ళతోనే ప్రకృతిని అనగదొక్కేస్తాడేమో.. అందుకే కొంచం ఇష్టం గా..  కొంచం కష్టంగా.. ఈ 'వెన్నెలతీరం'.